Logo

యోవేలు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ దినములలో, అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున

02 అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.

03 వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?

04 తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నాకేమైన చేయుదురా?

05 నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.

06 యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.

07 ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును

08 మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును; వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే.

09 అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.

10 మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను.

11 చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.

12 నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను

13 పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయెను, మీరు దిగి రండి.

14 తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు.

15 సూర్యచంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను.

16 యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.

17 అన్యులికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివ సించుచున్నానని మీరు తెలిసికొందురు.

18 ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిర ములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.

19 ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.

20 ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.

21 అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.