Logo

మలాకీ అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

02 అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటివాడు;

03 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని యుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.

04 అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును.

05 తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

06 యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

07 మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు.

08 మానవుడు దేవునియొద్ద దొంగిలునా? అయితే మీరు నాయొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.

09 ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.

10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11 మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు

12 అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

13 యెహోవా సెలవిచ్చునదేమనగా నన్నుగూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్నుగూర్చి యేమి చెప్పితిమని మీరడుగుదురు.

14 దేవునిసేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు,

15 గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు.

16 అప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

17 నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

18 అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు.