Logo

యాకోబు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?

02 మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు.

03 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.

04 వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

05 ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

06 కాదుగాని, ఆయన ఎక్కువ కృపనిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

07 కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

08 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీచేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.

09 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించు వాడవైతివి.

12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైయున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,

14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

15 కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అదిచేతమని చెప్పుకొనవలెను.

16 ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.

17 కాబట్టి మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.