Logo

2పేతురు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ద బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

02 మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.

03 వారు అధిక లోభులై, కల్పనా వాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వమునుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.

04 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

05 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.

06 మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మము చేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,

07 దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.

08 ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటిని బట్టియు వినినవాటిని బట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.

09 భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,

10 శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.

11 దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.

12 వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములనుగూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,

13 ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు.

14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి,

15 తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.

16 ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.

17 వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

18 వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలు గలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనినవారిని పోకిరి చేష్టలచేత మరలుకొల్పుచున్నారు.

19 తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా

20 వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.

21 వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.

22 కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.