Logo

2యోహాను అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.

02 నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.

03 సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవునియొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.

04 తండ్రివలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.

05 కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను.

06 మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.

07 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు.

08 అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునైయున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

09 క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు.

10 ఎవడైనను ఈ బోధను తేక మీయొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.

11 శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.

12 అనేక సంగతులు మీకు వ్రాయవలసి యుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను

13 ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.