క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.
02 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.
03 విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.
04 నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు.
05 నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు.
06 నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొరపాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?
07 అధికమైన స్వప్నములును మాటలును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము.
08 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు.
09 ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును.
10 ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే.
11 ఆస్తి యెక్కువైనయెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు; కన్నులార చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజనమేమి?
12 కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృధ్థిచేత నిద్రపట్టదు.
13 సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును.
14 అయితే ఆ ఆస్తి దురదృష్టమువలన నశించిపోవును; అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమియు లేకపోవును.
15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేత పట్టుకొనిపోడు;
16 అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి?
17 ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినములన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.
18 మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.
19 మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదనుకొనవలెను.
20 అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసికొనడు.