ప్రసంగి
అధ్యాయం 4
పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.
కాబట్టి యింకను బ్రదుకుచున్న వారికంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులనుకొంటిని.
ఇంకను పుట్టనివారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని.
మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలె నున్నది.
బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.
శ్రమయును గాలికైన యత్నములును రెండుచేతులనిండ నుండుటకంటె ఒకచేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.
నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.
ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడియుండుట మేలు.
వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును.
ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును?
ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?
మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు.
అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును.
సూర్యునిక్రింద సంచరించు సజీవులందరు గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలిసికొంటిని.
అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే.