ప్రసంగి
అధ్యాయం 11
నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.
ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.
మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమిమీద దాని పోయును; మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును.
గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.
చూలాలి గర్బమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.
వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా నున్నది.
ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని యెరిగియుండి తాను బ్రదుకుదినములన్నియు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము.
యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము;
లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.