Logo

1రాజులు అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలాపడగా

02 యరొబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.

03 కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డ యేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా

04 యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరానివాడై యుండెను.

05 అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనిగూర్చి నీచేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసికొని మరియొకతె యైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను.

06 అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెను యరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసికొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను.

07 నీవు వెళ్లి యరొబాముతో చెప్పవలసినదేమనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలోనుండి తీసి హెచ్చింపజేసి, ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా నియమించి

08 దావీదు సంతతివారి యొద్దనుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక

09 నీకంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడు చేసియున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు.

10 కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులుగాని ఘనులుగాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి, పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.

11 పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చియున్నాడు.

12 కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చనిపోవును;

13 అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.

14 ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింపబోవుచున్నాడు; ఆ దినముననే అతడు యరొబాము సంతతివారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును.

15 ఇశ్రాయేలువారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచిదేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదరగొట్టును.

16 మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింపబోవుచున్నాడు.

17 అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను.

18 జనులు అతనిని సమాధిలో పెట్టి, యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయాద్వారా సెలవిచ్చిన ప్రకారముగ ఇశ్రాయేలు వారందరును అతనికొరకు అంగలార్చిరి.

19 యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

20 యరొబాము ఏలిన దినములు ఇరువదిరెండు సంవత్సరములు; అతడు తన పితరులతో కూడ నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను.

21 యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము నలువదియొక సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమను పట్టణమందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను; అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.

22 యూదావారు యెహోవా దృష్టికి కీడుచేసి తమ పితరులు చేసినదానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి.

23 ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతా స్తంభములను ఉంచిరి.

24 మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచు వచ్చిరి.

25 రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి

26 యెహోవా మందిరపు ఖజనాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజనాలోని పదార్థములను, ఎత్తికొనిపోయెను, అతడు సమస్తమును ఎత్తికొనిపోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొనిపోయెను.

27 రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వారపాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.

28 రాజు యెహోవా మందిరమునకు వెళ్లునప్పుడెల్ల రాజదేహ సంరక్షకులు వాటిని మోసికొనిపోయి అతడు తిరిగిరాగా వాటిని తమ గదిలో ఉంచిరి.

29 రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

30 వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.

31 రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.