Logo

యోనా అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

02 నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.

03 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము.

04 యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా

05 నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాసదినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.

06 ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.

07 మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా

08 ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొఱ్ఱలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,

09 మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.

10 ఈ నీనెవెవారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడు చేయక మానెను.