Logo

యోనా అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని

02 యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని.

03 నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను.

04 అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.

05 అప్పుడు యోనా ఆ పట్టణములోనుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిలి యొకటి వేసికొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా

06 దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను.

07 మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను.

08 మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.

09 అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను.

10 అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే;

11 అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.