Logo

గలతీయులకు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల యెదుట ప్రదర్శింపబడెను గదా!

02 ఇది మాత్రమే మీవలన తెలిసికొన గోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

03 మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?

04 వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా?

05 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?

06 అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను.

07 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.

08 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.

09 కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

11 ధర్మశాస్త్రముచేత ఎవడును దేవుని యెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

12 ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదుగాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.

13 ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

14 ఇందునుగూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

15 సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.

16 అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులనుగూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకనిగూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు

17 నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.

18 ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానమువలననే దానిని అనుగ్రహించెను.

19 ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

20 మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.

21 ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడియున్నయెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని

22 యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.

23 విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైనవారమైతివిు.

24 కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

25 అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.

26 యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.

27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

28 ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.