Logo

1తిమోతి అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.

02 అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,

03 మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై,

04 సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.

05 ఎవడైనను తన యింటివారిని ఏలనేరకపోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?

06 అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.

07 మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను.

08 ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభమునపేక్షించువారునై యుండక

09 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను.

10 మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.

11 అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.

12 పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.

13 పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసు నందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు.

14 శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;

15 అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది

16 నిరాక్షేపముగా దైవభక్తినిగూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.