Logo

1తిమోతి అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును

02 రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.

03 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునైయున్నది.

04 ఆయన, మనుష్యులందరు రక్షణ పొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.

05 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

06 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

07 ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.

08 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైనచేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

09 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,

10 దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.

11 స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.

12 స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?

14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.

15 అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును.