Logo

ఆదికాండము అధ్యాయము 39

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యాసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.

02 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.

03 యెహోవా అతనికి తోడైయుండెననియు, అతడు చేసినదంతయు అతనిచేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు

04 యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతనియొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతికప్పగించెను.

05 అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను

06 అతడు తనకు కలిగినదంతయు యోసేపుచేతికప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను

07 అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

08 అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నాచేతికప్పగించెను గదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.

09 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

10 దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు.

11 అట్లుండగా ఒకనాడు అతడు తన పనిమీద ఇంటి లోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.

12 అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమెచేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

13 అతడు తన వస్త్రమును ఆమెచేతిలో విడిచి తప్పించుకొనిపోవుట ఆమె చూచినప్పుడు

14 తన యింటి మనుష్యులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నాయొద్దకు రాగా నేను పెద్ద కేకవేసితిని.

15 నేను బిగ్గరగా కేకవేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి

16 అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచుకొనెను.

17 అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.

18 నేను బిగ్గరగా కేకవేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెననెను

19 కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి

20 అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

21 అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను.

22 చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరిని యోసేపుచేతికప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు.

23 యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనిచేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.