Logo

ఆదికాండము అధ్యాయము 48

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోగా,

02 ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీయొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచముమీద కూర్చుండెను.

03 యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి

04 ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను

05 ఇదిగో నేను ఐగుప్తునకు నీయొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు.

06 వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.

07 పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.

08 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా

09 యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొని రమ్మనెను.

10 ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను.

11 ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా

12 యోసేపు అతని మోకాళ్ల మధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.

13 తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన యెడమచేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను.

14 మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తనచేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.

15 అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,

16 అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించును గాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను

17 యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండియెత్తి

18 నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.

19 అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను

20 ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.

21 మరియు ఇశ్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొనిపోవును.

22 నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయులచేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.