Logo

సామెతలు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీయొద్ద దాచిపెట్టుకొనుము.

02 నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.

03 నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము

04 జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.

05 అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చకములాడు పర స్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.

06 నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానము లేనివారి మధ్యను

07 యౌవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.

08 సందెవేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ

09 వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని యింటి మార్గమున నడుచుచుండెను.

10 అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.

11 అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.

12 ఒకప్పుడు ఇంటి యెదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది యుండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును.

13 అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను

14 సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను

15 కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి

16 నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.

17 నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లియున్నాను.

18 ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పర మోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.

19 పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు

20 అతడు సొమ్ముసంచిచేత పట్టుకొనిపోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను

21 అది తన అధికమైన లాలన మాటలచేత వానిని లోపరచుకొనెను తాను పలికిన యిచ్చకపు మాటలచేత వాని నీడ్చుకొని పోయెను.

22 వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

23 తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.

24 నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి

25 జార స్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.

26 అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది

27 దాని యిల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.