Logo

సామెతలు అధ్యాయము 21

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును.

02 ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు.

03 నీతిన్యాయములననుసరించి నడచుకొనుట బలులనర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.

04 అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.

05 శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును

06 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.

07 భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొనిపోవును.

08 దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.

09 గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.

10 భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.

11 అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశమువలన తెలివినొందును.

12 నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.

13 దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱ పెట్టునప్పుడు అంగీకరింపబడడు.

14 చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతిపరచును.

15 న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.

16 వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.

17 సుఖభోగములయందు వాంఛ గలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.

18 నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు

19 ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.

20 విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.

21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.

22 జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.

23 నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

24 అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును.

25 సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.

26 దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.

27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.

28 కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.

29 భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.

30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.

31 యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము.