Logo

దానియేలు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.

02 దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.

03 అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.

04 మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.

05 రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.

06 అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్యమియ్యబడెను.

07 పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహా బలమహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుపదంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.

08 నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్నకొమ్ము వాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.

09 ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమమువలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను.

10 అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయన యెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.

11 అప్పుడు నేను చూచుచుండగా, ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.

12 మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను; సమయము వచ్చువరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను.

13 రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహా వృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.

14 సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు.

15 నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని.

16 నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకనియొద్దకు పోయి ఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా, అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను.

17 ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.

18 అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంతములవరకు రాజ్యమేలుదురు.

19 ఇనుపదంతములును ఇత్తిడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.

20 మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.

21 ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయెను.

22 ఆ మహా వృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమునేలుదురను సంగతి నేను గ్రహించితిని.

23 నేనడగినదానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును.

24 ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.

25 ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

26 అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును.

27 ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్యమహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.

28 దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతిని; అందుచేత నా ముఖము వికారమాయెను; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని.