Logo

దానియేలు అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.

02 అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.

03 అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని.

04 నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి యొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా,

05 మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమునుబట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయదేశ జనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక

06 నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.

07 ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.

08 ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది.

09 మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితివిు; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.

10 ఆయన తన దాసులగు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతివిు.

11 ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.

12 యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెరవేర్చెను.

13 మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.

14 మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై యుండి, సమయము కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రాజేసెను.

15 ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలమువలన నీ జనమును ఐగుప్తులోనుండి రప్పించుటవలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము.

16 ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, యెరూషలేము నీ జనులచుట్టు నున్న సకల ప్రజల యెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.

17 ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధస్థలము మీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.

18 నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.

19 ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.

20 నేను ఇంక పలుకుచు ప్రార్థన చేయుచు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని.

21 నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను.

22 అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలూ, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని.

23 నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము.

24 తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధస్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను.

25 యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.

26 ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.

27 అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.