Logo

దానియేలు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా

02 ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతికప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.

03 రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

04 తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

05 మరియు రాజు తాను భుజించు ఆహారములోనుండియు తాను పానముచేయు ద్రాక్షారసములోనుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.

06 యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి.

07 నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.

08 రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడుకొనగా

09 దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను

10 మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడనేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.

11 నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను.

12 భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.

13 పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము.

14 అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను.

15 పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా

16 రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యాదుల నిచ్చెను.

17 ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.

18 నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.

19 రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి.

20 రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్యగల వారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.

21 ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను.