Logo

మీకా అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనునుగూర్చియు యెరూషలేమునుగూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

02 సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలో నున్న సమస్తమును చెవియొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్దాలయములో నుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

03 ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నతస్థలములమీద నడువబోవుచున్నాడు.

04 ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,

05 యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనేగదా; యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా?

06 కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడురాళ్లను లోయలో పారబోసెదను;

07 దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతముపెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరల ఇయ్యబడును.

08 దీని చూచి నేను కేకలువేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగంబరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.

09 దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి.

10 గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని.

11 షాఫీరు నివాసీ, దిగంబరివై అవమానము నొంది వెళ్లిపొమ్ము; జయనాను వారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది.

12 మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధనొందుచున్నారు ఏలయనగా యెహోవాయొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకు వచ్చెను.

13 లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలువారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును.

14 మోరెషెత్గతు విషయములో మీరు విడుదల కైకోలు ఇయ్యవలసి వచ్చును, అక్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై యుండును.

15 మారేషా నివాసీ, నీకు హక్కుదారుడగు ఒకని నీయొద్దకు తోడుకొనివత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.

16 సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరుచగద్ద వలె నీ బోడితనము కనుపరచుకొనుము.