Logo

మీకా అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.

02 వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.

03 కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా--గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువ లేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయ నుద్దేశించుచున్నాను.

04 ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియు,మన భూములను తిరుగబడినవారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొను చున్నట్లు జనులు చెప్పుకొందురు.

05 చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలుపొందునట్లు నూలు వేయువాడొకడును ఉండడు.

06 మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపనియెడల అవమానము కలుగక మానదు.

07 యాకోబు సంతతివారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?

08 ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి; నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పైవస్త్రములను లాగుకొందురు.

09 వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డలయొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొనిపోవుదురు.

10 ఈ దేశము మీ విశ్రాంతిస్థలము కాదు; మీరు లేచి వెళ్లిపోవుడి, మీకు నాశనము నిర్మూలనాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.

11 వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినయెడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును.

12 యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగుచేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగుచేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.

13 ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును.