Logo

మీకా అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.

02 తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయులమీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.

03 నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.

04 ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.

05 నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగినవాటిని, మనస్సునకు తెచ్చు కొనుడి.

06 ఏమి తీసికొనివచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొనివచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారముచేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?

07 వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా?

08 మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

09 ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానినిగూర్చిన వార్తను ఆలకించుడి

10 అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా.

11 తప్పు త్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?

12 వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.

13 కాబట్టి నీవు బాగుపడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.

14 నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవుదానిని దోపుడుకు నేనప్పగింతును.

15 నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు.

16 ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతిపుట్టించు జనులుగాను పట్టణనివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను.