Logo

ప్రకటన అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడై యుండువాని కుడిచేత చూచితిని.

02 మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.

03 అయితే పరలోకమందుగాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.

04 ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా

05 ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.

06 మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.

07 ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.

08 ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

09 ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని,

10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

11 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.

12 వారు వధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

13 అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని

14 ఆ నాలుగు జీవులు ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.