Logo

ప్రకటన అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.

02 ఆయనచేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

03 సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.

04 ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.

05 మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి

06 పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని

07 యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.

08 అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూతచేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని

09 నేను ఆ దూతయొద్దకు వెళ్లి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.

10 అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూతచేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను

11 అప్పుడు వారు నీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.