Logo

ప్రకటన అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు పెద్ద సంకెళ్లనుచేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవి గల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.

02 అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,

03 ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.

04 అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నోసల్లయందుగానిచేతులయందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్చేదనము చేయబడినవారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి

05 ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

06 ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారము లేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

07 వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

08 భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

09 వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

10 వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

11 మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడి యుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి.

13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను.

14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.