Logo

రూతు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను.

02 ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.

03 నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.

04 వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు.

05 వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.

06 వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.

07 అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతో కూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్లుచుండగా

08 నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగివెళ్లుడి; చనిపోయిన వారియెడలను నాయెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీయెడల దయచూపును గాక;

09 మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను.

10 అంతట వారు ఎలుగెత్తి యేడ్చి నీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా

11 నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా?

12 నా కుమార్తెలారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను

13 వారు పెద్ద వారగువరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరికత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంత కంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను.

14 వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా

15 ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగిపోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్లుమనెను.

16 అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;

17 నీవు మృతిబొందు చోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.

18 తనతో కూడ వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసికొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.

19 వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా

20 ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి.

21 నేను సమృధ్దిగలదాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.

22 అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.