Logo

రూతు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆమె అత్తయైన నయోమి నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.

02 ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.

03 నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.

04 అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికిపోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా

05 ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి

06 ఆ కళ్లము నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను.

07 బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.

08 మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొనియుండెను.

09 అతడునీ వెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా

10 అతడు నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ప్రవర్తన కంటె వెనుకటి సత్‌ప్రవర్తన మరి ఎక్కువైనది.

11 కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.

12 నేను నిన్ను విడిపింపగల వాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువుడొకడున్నాడు.

13 ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను.

14 కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను.

15 మరియు అతడు నీవు వేసికొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.

16 ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్త నా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి

17 నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చెననెను.

18 అప్పుడు ఆమె నా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియువరకు ఊరకుండుమనెను.