Logo

ఎజ్రా అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా

02 మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.

03 రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమునుగూర్చి నిర్ణయించినది బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను;

04 మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానులచేతను కట్టింపబడవలెను; దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి యియ్యవలెను.

05 మరియు యెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసికొని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.

06 కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను నది యవతల అధికారియైన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతోకూడ నున్న అపర్సెకాయులును యూదుల జోలికి పోక

07 దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనియ్యుడి.

08 మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను.

09 మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలే గాని గొఱ్ఱపొట్టేళ్లే గాని గొఱ్ఱ పిల్లలేగాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్షారసమే గాని నూనెయే గాని, యెరూషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ

10 వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.

11 ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింప బడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయబడును.

12 ఏ రాజులేగాని యే జనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.

13 అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.

14 యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపు రాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.

15 రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.

16 అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదల నొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.

17 దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱపిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేకపోతులను అర్పించిరి.

18 మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసినదానినిబట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి.

19 చెరలోనుండి విడుదల నొందినవారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కా పండుగ ఆచరించిరి.

20 యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి.

21 కావున చెరలో నుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి, తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి.

22 ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారిచేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.