క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 యెహోవా సెలవిచ్చునదేమనగా మోయాబు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి.
02 మోయాబుమీద నేను అగ్ని వేసెదను, అది కెరీయోతు నగరులను దహించివేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును.
03 మోయాబీయులకు న్యాయాధిపతి యుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
04 యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమ పితరులనుసరించిన అబద్ధములను చేపట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనకపోయిరి.
05 యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.
06 యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మివేయుదురు.
07 దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;
08 తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.
09 దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,
10 మరియు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.
11 మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు.
12 అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
13 ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.
14 అప్పుడు అతివేగి యగువాడు తప్పించుకొనజాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొనజాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును.
15 విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.
16 మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.