Logo

ఆమోసు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కడవరిగడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపరచెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.

02 నేలను మొలిచిన పచ్చిక యంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా

03 యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.

04 మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను. అదివచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి, స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు

05 ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును? మానివేయుమని నేను మనవి చేయగా

06 ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరుగదని సెలవిచ్చెను.

07 మరియు యెహోవా తాను మట్టపుగుండుచేత పట్టుకొని గుండుపెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను.

08 యెహోవా ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయబోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను

09 ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గముచేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.

10 అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యరొబామునకు వర్తమానము పంపి ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు;

11 యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు; అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను.

12 మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము;

13 బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠితస్థలము రాజధాని పట్టణమైయున్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు.

14 అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసుల కాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను.

15 నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవుపోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను.

16 యెహోవా మాట ఆలకించుము ఇశ్రాయేలీయులనుగూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతివారినిగూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.

17 యెహోవా సెలవిచ్చునదేమనగా నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కూమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.