Logo

ఆమోసు అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు వారలారా, మిమ్మునుగూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి.

02 కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది.

03 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలువారిలో వెయ్యిమందియై బయలువెళ్లిన పట్టణస్థులలో నూరుమంది తప్పించుకొని వత్తురు; నూరుమందియై బయలువెళ్లిన పట్టణస్థులలో పదిమంది తప్పించుకొని వత్తురు.

04 ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చునదేమనగా నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.

05 బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.

06 యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనము చేయును.

07 న్యాయమును అన్యాయమునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా,

08 ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.

09 ఆయన పేరు యెహోవా; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.

10 అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.

11 దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన

12 మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్షతోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు.

13 ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.

14 మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును.

15 కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారియందు కనికరించును.

16 దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీ మధ్య సంచరింప బోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు; అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు.

17 ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినబడును.

18 యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్న వారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.

19 ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.

20 యెహోవా దినము నిజముగా వెలుగై యుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా?

21 మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రతదినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.

22 నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.

23 మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు.

24 నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి.

25 ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా?

26 మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.

27 కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యములకధిపతియగు దేవుడు.