Logo

జెకర్యా అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా దూత యెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.

02 సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనేయున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.

03 యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా

04 దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.

05 అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలుచుండెను.

06 అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.

07 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా మార్గములలొ నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.

08 ప్రధానయాజకుడవైన యెహోషువా, నీయెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నామాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.

09 యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును;

10 ఆ దినమున ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.