Logo

జెకర్యా అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడును.

02 ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండచేతును.

03 ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు.

04 ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు, తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.

05 వాడు నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును.

06 నీచేతులకు గాయములేమని వారడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.

07 ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరి మీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు గొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.

08 దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.

09 ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.