Logo

జెకర్యా అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

02 యెహోవా మీ పితరులమీద బహుగా కోపించెను.

03 కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

04 మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి; ఇదే యెహోవా వాక్కు.

05 మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?

06 అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.

07 మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

08 రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజిచెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.

09 అప్పుడు నా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను.

10 అప్పుడు గొంజిచెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.

11 అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతట తిరుగులాడి వచ్చియున్నాము; ఇదిగో లోకులందరు శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను.

12 అందుకు యెహోవా దూత సైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపక యుందువు అని మనవిచేయగా

13 యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.

14 కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనెను నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధికాసక్తి కలిగియున్నాను;

15 నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.

16 కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగలాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

17 నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

18 అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.

19 ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్న దూతనడుగగా అతడు ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.

20 యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా

21 వీరేమి చేయబోవుచున్నారని నేనడిగినందుకు ఆయన ఎవడును తల యెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదా దేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.