Logo

జెకర్యా అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రాజైన దర్యావేషు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలువారు షెరెజెరును రెగెమ్మెలెకును తమవారిని పంపి

02 ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు అయిదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని

03 యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా

04 సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

05 దేశపు జనులందరికిని యాజకులకును నీవీమాట తెలియజేయవలెను. ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట అయిదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?

06 మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి; మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి.

07 యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా?

08 మరియు యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

09 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యముననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనుపరచుకొనుడి.

10 విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి.

11 అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి.

12 ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవాయొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను.

13 కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను.

14 మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచినమీదట అందులో ఎవరును సంచరింపకుండ అది పాడగును; ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసియున్నారు.