క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను.
02 నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
03 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను
04 అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును అని వ్రాయబడి యున్నదనెను.
05 అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
06 నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుము ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్నుచేతులతో ఎత్తికొందురు
07 అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి యున్నదని వానితో చెప్పెను.
08 మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
09 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా
10 యేసు వానితో సాతానా, పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి యున్నదనెను.
11 అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.
12 యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.
14 జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
15 చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
16 అని ప్రవక్తయైన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
17 అప్పటినుండి యేసు పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.
18 యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగాచేతునని వారితో చెప్పెను;
20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
21 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయియొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
22 వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
23 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతట సంచరించెను.
24 ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరిని, దయ్యము పట్టినవారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ యను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.