Logo

మత్తయి అధ్యాయము 27

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి

02 ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

03 అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి

04 నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

05 అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను.

06 ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుకపెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి.

07 కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి.

08 అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.

09 అప్పుడు విలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది

10 వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను.

11 యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి యూదుల రాజవు నీవేనా? అని ఆయననడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను

12 ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

13 కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

14 అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.

15 జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదలచేయుట అధిపతికి వాడుక.

16 ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.

17 కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని

18 విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను

19 అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతనియొద్దకు వర్తమానము పంపెను

20 ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి

21 అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి.

22 అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి.

23 అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

24 పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.

25 అందుకు ప్రజలందరు వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.

26 అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

27 అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికులనందరిని సమకూర్చిరి.

28 వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి

29 ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడిచేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

30 ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.

31 ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొనిపోయిరి.

32 వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి.

33 వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి

34 చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.

35 వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.

36 అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి.

37 ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

38 మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువ వేయబడిరి.

39 ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు

40 దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

41 ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

42 వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

43 వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

44 ఆయనతో కూడ సిలువ వేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

45 మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.

46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.

47 అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

49 తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి.

50 యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;

52 సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను.

53 వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.

54 శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలియున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.

55 యేసునకు ఉపచారము చేయుచు గలిలయనుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.

56 వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరి యయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.

57 యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి

58 పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.

59 యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి

60 తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

61 మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగాకూర్చుండియుండిరి.

62 మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి

63 అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.

64 కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి.

65 అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీచేతనైనంతమట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.

66 వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి.