Logo

మత్తయి అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని

02 ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచియున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను.

03 ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,

04 హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించియుండెను.

05 అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.

06 అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను

07 గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.

08 అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నాకిప్పించుమని యడిగెను.

09 రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి

10 బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను.

11 వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొనివచ్చెను.

12 అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి.

13 యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయన వెంట వెళ్లిరి.

14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.

15 సాయంకాలమైనప్పుడు శిష్యులాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి.

16 యేసు వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా

17 వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి.

18 అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి

19 పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.

20 వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపలనిండ ఎత్తిరి

21 స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

22 వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

23 ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.

24 అప్పటికా దోనె దరికి దూరముగ నుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్టబడుచుండెను.

25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను

26 ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

27 వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా

28 పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

29 ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని

30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.

31 వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

32 వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.

33 అంతట దోనెలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.

34 వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.

35 అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయనయొద్దకు తెప్పించి

36 వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.