Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తనయొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలుదేరెను.

02 ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను.

03 అతడు అక్కడ మూడునెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్లవలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియ మీదుగా తిరిగిరావలెనని నిశ్చయించుకొనెను.

04 మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి.

05 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.

06 పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితివిు.

07 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.

08 మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.

09 అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయినవాడై యెత్తబడెను

10 అంతట పౌలు క్రిందికివెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.

11 అతడు మరల పైకివచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను.

12 వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.

13 మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితివిు. తాను కాలినడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను.

14 అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితివిు.

15 అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితివిు. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితివిు.

16 సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.

17 అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.

18 వారు తనయొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు.

19 యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.

20 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

21 దేవుని యెదుట మారుమనస్సుపొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.

22 ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని,

23 బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.

24 అయితే దేవుని కృపా సువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు

25 ఇదిగో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని; మీలో ఎవరును ఇకమీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును.

26 కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.

27 దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.

28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

29 నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.

30 మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.

31 కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.

32 ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు.

33 ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;

34 నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నాచేతులు కష్టపడినవని మీకే తెలియును.

35 మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

36 అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను.

37 అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు

38 పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగనంపిరి.