Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 26

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయిచాచి యీలాగు సమాధానము చెప్పసాగెను

02 అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక

03 యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను.

04 మొదటినుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.

05 వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.

06 ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.

07 మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపియున్నారు.

08 దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?

09 నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;

10 యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;

11 అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని

12 అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా

13 రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

14 మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

15 అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.

16 నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము;

17 నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;

18 వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

20 మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.

21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి;

22 అయినను నేను దేవునివలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని

23 ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.

24 అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతివిద్య వలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.

25 అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనతవహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.

26 రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండలేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.

27 అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.

28 అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.

29 అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.

30 అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి

31 ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.

32 అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.