Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని

02 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.

03 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.

04 అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను

05 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను.

06 హేరోదు అతనిని వెలుపలికి తీసికొనిరావలెనని యుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.

07 ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.

08 అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైనవేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.

09 అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.

10 మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకుపోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.

11 పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.

12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థన చేయుచుండిరి.

13 అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.

14 ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.

15 అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.

16 పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతినొందిరి.

17 అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను

18 తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.

19 హేరోదు అతని కోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయనుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.

20 తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధానపడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.

21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా

22 జనులు ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలు వేసిరి.

23 అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.

24 దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.

25 బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.