Logo

2కొరిందీయులకు అధ్యాయము 1

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

02 మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

03 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.

04 దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.

05 క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.

06 మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది.

07 మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.

08 సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు.

09 మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మికయుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.

10 ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.

11 అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరము కొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.

12 మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే

13 మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము.

14 మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంతమట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.

15 మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,

16 మీయొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని.

17 కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?

18 దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.

19 మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడైయున్నాడు.

20 దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి.

21 మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.

22 ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.

23 మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.

24 మీ విశ్వాసముమీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమైయున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.