Logo

2కొరిందీయులకు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.

02 అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!

03 ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.

04 మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక

05 శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,

06 పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను

07 సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,

08 ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

09 మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము;

10 దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

11 ఓ కొరింథీయులారా, అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడియున్నది.

12 మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమైయున్నది.

13 మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.

14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?

15 క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

17 కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

18 మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినైయుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.