Logo

2కొరిందీయులకు అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలాగైనను సహించుడి.

02 దేవాసక్తితో మీయెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,

03 సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.

04 ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే.

05 నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.

06 మాటలయందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేనివాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరచియున్నాము.

07 మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?

08 మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.

09 మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్తపడుదును

10 క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయపడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.

11 ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.

12 అతిశయ కారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును

13 ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

14 ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు

15 గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును.

16 నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పుచున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి.

17 నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.

18 అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.

19 మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.

20 ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసికొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.

21 మేము బలహీనులమైయున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగియున్నాడో, ఆ విషయమందు నేను కూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.

22 వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే.

23 వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరియెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరివిశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

24 యూదులచేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

25 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

26 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని

27 ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

28 ఇవియును గాక సంఘములన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది.

29 ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?

30 అతిశయపడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులనుగూర్చియే అతిశయపడుదును.

31 నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.

32 దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.

33 అప్పుడు నేను కిటికీగుండ గోడమీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.