Logo

2కొరిందీయులకు అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఈ మూడవసారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను.

02 నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టుగానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలినవారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.

03 క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడైయున్నాడు.

04 బలహీనతనుబట్టి ఆయన సిలువ వేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమైయున్నాము గాని, మీయెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవము గలవారము.

05 మీరు విశ్వాసము గలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మునుగూర్చి మీరే యెరుగరా?

06 మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.

07 మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.

08 మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.

09 మేము బలహీనులమైయున్నను మీరు బలవంతులైయుండినయెడల సంతోషించెదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావలెననియే ప్రార్థించుచున్నాము.

10 కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.

11 తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సు గలవారైయుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

12 పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

13 పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.

14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.