Logo

హోషేయ అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.

02 అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు.

03 కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశపక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.

04 ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు.

05 కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును.

06 నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.

07 తమకు కలిమి కలిగిన కొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును.

08 నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.

09 కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తననుబట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారముచేతును.

10 వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు.

11 వ్యభిచార క్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానము చేయుటచేతను మద్యపానముచేతను వారు మతిచెడిరి.

12 నా జనులు తాము పెట్టుకొనిన కఱ్ఱయొద్ద విచారణ చేయుదురు, తమచేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.

13 పర్వతముల శిఖరములమీద బలులనర్పింతురు, కొండలమీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి.

14 జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులనర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటనుబట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూలమగును.

15 ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవును గాక. గిల్గాలునకు పోవద్దు; బేతావెనునకు పోవద్దు; యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు.

16 పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱపిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.

17 ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము.

18 వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారము చేయువారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకరమైన దానిని ప్రేమింతురు.

19 సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును; తాము అర్పించిన బలులనుబట్టి వారు సిగ్గునొందుదురు.