Logo

హోషేయ అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము.

02 వారు మా దేవా, ఇశ్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగియున్న వారమే యని నాకు మొఱ్ఱ పెట్టుదురు;

03 ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును.

04 నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.

05 షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నా కోపము వారిమీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు?

06 అది ఇశ్రాయేలువారిచేతిపనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.

07 వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.

08 ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టముకాని ఘటమువంటి వారై అన్యజనులలో నుందురు.

09 అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను.

10 వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును; అధిపతులుగల రాజు పెట్టు భారముచేత వారు త్వరలో తగ్గిపోవుదురు.

11 ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను.

12 నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.

13 నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.

14 ఇశ్రాయేలువారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.