Logo

హోషేయ అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు బాలుడై యుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తు దేశములోనుండి పిలిచితిని.

02 ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి.

03 ఎఫ్రాయిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు

04 ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని

05 ఐగుప్తు దేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారిమీద ప్రభుత్వము చేయును.

06 వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును.

07 నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు

08 ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లుచేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లుచేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నది.

09 నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.

10 వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.

11 వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.

12 ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.